షుగర్ పేషెంట్లు అన్నం ఎంత తక్కువగా తింటే అది అంత కంట్రోల్ లో ఉంటుందని చెప్తుంటారు. అన్నం బదులు చపాతీ తీసుకుంటే మంచిదని సూచిస్తుంటారు. ఎప్పటి నుంచో అలవాటైన అన్నం మానక్కర్లేదంటారు మరికొందరు. అందుకే అన్నం తినాలో వద్దో కన్ఫ్యూజ్ అవుతుంటాం. మరి ఏది నిజం? అన్నమే తినాలనుకుంటే ఏ అన్నం బెస్ట్?
రాత్రి పూట అన్నం తినాలా… చపాతీ తినాలా అన్న మీమాంస చాలామందిలో ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లే కాదు.. ఎవరైనా సరే రాత్రిపూట చపాతీ తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. అన్నానికి బదులుగా చపాతీలను తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. చపాతీలను తయారు చేసే గోధుమ పిండిలో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా కాపర్, జింక్, అయోడిన్, పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. ముఖ్యంగా దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే రక్తం కూడా బాగా తయారవుతుంది.
రాత్రి పూట మరీ మంచిది
రోజూ రాత్రి పూట చపాతీలను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. అజీర్తి ఉండే వారు చపాతీలను తింటే ఆ సమస్యనుంచి బయట పడవచ్చు. చపాతీలు చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి. అందువల్ల రాత్రి పూట వాటిని తింటే త్వరగా జీర్ణమై త్వరగా నిద్ర వస్తుంది. నిద్రకు ఆటంకం ఉండదు. చపాతీలను రోజూ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.
అన్నం తినాలనుకుంటే…
దక్షిణ భారతదేశంలో మనకు అన్నమే ప్రధాన ఆహారం. దాని బదులు ఏం తిన్నా తిన్నట్టుండదు. అందుకే మనం ఎప్పుడో మరిచిపోయిన దేశీ వరి బియ్యాన్ని తీసుకుంటే పోషకాలు రావడంతో పాటు డయాబెటిస్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. రెడ్ రైస్ గా పిలిచే నవ్వారా బియ్యం డయాబెటిస్ ఉన్నవాళ్లకు కూడా మంచి ఫలితాలను ఇస్తుందని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు.