నేను డిగ్రీ చదువుతున్న రోజులవి. ప్రైవేటుగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్నాను. అక్క కూడా ఉద్యోగం చేసుకుంటూ కరస్పాండెంట్ కోర్సు లో పీజీ చేస్తున్నది. డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అలాంటి సమయంలో ఒక రోజు మా అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది . ఎంత పిలిచిన పలకదు. దాదాపుగా స్పృహ తప్పింది.
దగ్గరలో ఉన్న నర్సింగ్ హామ్ కి తీసుకెళ్ళాము. ఇక్కడ కుదరదు. పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లమని సూచించారు అక్కడి డాక్టర్లు. మాకు కాళ్ళుచేతులు ఆడలేదు. ఏమయ్యిందోనని ఒకటే టెన్షన్.
ట్యూషన్ కి వచ్చే పిల్లల సాయంతో గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్ళాము. అప్పట్లో గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉండేది. ఆటోలో వెళ్తున్నమాటేగాని మనసు మనసులో లేదు . అమ్మకేమయింది..? ఒకటే ఆలోచన. నాన్న ఎలాగూ లేరు. ఇప్పుడు అమ్మ కి కూడా ఏమన్నా అయితే ఎలా ?? భయం, బాధ కలిగిన భావోద్వేగాల మధ్య గాంధీ హాస్పిటల్ వచ్చేసింది. అసలే ఆందోళన తో ఉన్న మేము స్ట్రెచర్ దొరకడానికి వెయిట్ చేయాల్సి వచ్చింది. నాకు కోపం వచ్చి అక్కడి వాళ్ళపై అరిచేశాను. ఎమర్జెన్సీ అన్నపుడు కూడా ఎవ్వరూ పట్టించుకోరేంటి అని. ఏదైతేనేం..హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకున్నారు. రోజు ఎవరెవరో డాక్టర్లు వచ్చి చూసి వెళ్తుండేవారు. అమ్మకి కావాల్సిన ఆహారం హాస్పిటల్ లో వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే వార్డు దగ్గర ఉండే ఆయాలు, బాయ్ ల దగ్గరినుంచి లంచాల కోసం డిమాండులు మాకు కూడా ఎదురయ్యాయి. మేమే డబ్బులు లేక ఏడుస్తుంటే, ఈ వేధింపులెంటా అనిపించింది. కోపం వచ్చి ఒక్కసారిగా వాళ్ళ మీదకి అరిచేశాను. ‘ మీకు జీతాలు ఇవ్వట్లేదా? మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? సూపరింటెండెంట్ కి కంప్లయింట్ ఇవ్వమంటవా?’అంటూ గట్టిగా మాట్లాడాను. ‘ఇది మనసులో పెట్టుకొని పేషెంట్ ని సరిగ్గా చూడకపోయినా ఊరుకోను ఎక్కడిదాకైనా వెళ్తాను’. అని బెదిరించాను కూడా. అప్పుడు గాని ఈ వేధింపులు ఆగలేదు. అక్కకు అప్పుడే పీజీ పరీక్షలు. అమ్మ దగ్గర కూర్చుని పరీక్షలకు చదువుకుంది. నేను ఇంటికి, హాస్పిటల్ కి తిరగడం. ఒక్కదాన్నే ఇంట్లో ఉండటానికి భయపడే నేను అప్పుడంత మొండిగా ఎలా ఉండగలిగానో అనిపిస్తుంది ఇప్పుడు.
అమ్మను జాయిన్ చేసిన మూడు రోజులకి డాక్టర్ శివరాజ్ అని హౌస్ సర్జన్, ఇంకా మారిద్దరు డాక్టర్ల కు అమ్మను అప్పగించారు. ఆ ముగ్గురిలో డాక్టర్ శివరాజ్ కొంచెం ఎక్కువ శ్రద్దగా అమ్మను చూస్తున్నట్టు అనిపించింది. ఆయన ఆధ్వర్యంలో రకరకాల టెస్టులు చేశారు. టెస్టుల రిపోర్టులు చూసి డాక్టర్లు చాలా హడావిడి పడ్డారు. అంతకుముందు వరకు మాకు ఉన్న టెన్షన్ ఇప్పుడు డాక్టర్లలో కనిపించింది. నాకున్న కొద్ది అవగాహనతో ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. అమ్మకు రక్తం చాలా తక్కువ ఉందని తేలింది. అందుకే స్పృహ తప్పి పడిపోయింది. పూర్తి పరిస్థితి ఏంటో అడగాలంటే కొంచెం ఆలోచించాను. ఇలా ఆలోచించడానికి కూడా కారణం లేకపోలేదు.
నేను ప్రైమరీ స్కూల్ లో చదువుతున్నప్పుడు ఓసారి నాకు చాలా జ్వరం వచ్చింది. అప్పుడు డాక్టర్ ని చాలా సందేహాలు అడిగాను. జ్వరం ఎందుకు వచ్చింది? అసలెందుకు వస్తుంది? ఏమవుతుంది?.. ఇలాగన్నమాట. అప్పుడా డాక్టర్ నన్ను చాలా విసుక్కున్నాడు. నీకేం అర్థం అవుతుందని అడుగుతున్నావ్? అంటూ కోపపడ్డాడు . అలా కోపం ప్రదర్శించకుండా నాకు అర్థమయ్యే భాషలో చెప్పవచ్చు కదా అనిపించింది. అప్పటి నుంచి డాక్టర్ లను ఏదైనా డౌట్ ఆడగాలంటే కొంచెం ఆలోచిస్తాను.
ఇప్పుడు అమ్మ విషయంలో కలిగిన ఆందోళన ఆ శషభిష ను అధిగమించింది. అందుకే డాక్టర్ శివరాజ్ ను అడిగాను. కానీ నేను ఊహించినట్టుగా ఆయన నన్ను విసుక్కోలేదు. చాలా ఓపిగ్గా నేను అడిగిన సిల్లీ ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాడు. అమ్మ రక్తంలో హిమోగ్లోబిన్ 2.8 ఉంది. అసలు తాను బతికి ఉండటమే మిరాకిల్ అన్నాడాయన. కనీసం 11 ఉండాల్సిన హిమోగ్లోబిన్ 2.8 కి పడిపోవడం వల్ల అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. నిజానికి 4-5 ఉంటే కూడా ప్రాణాపాయం కలుగుతుందట. మందులకు అమ్మ బాగా రెస్పాండ్ అవుతున్నది. కాబట్టి అమ్మకు ఏమీ కాదన్న భరోసా కల్పించాడు. రెగ్యులర్ గా ప్రతిరోజూ వచ్చి అమ్మ పరిస్థితి ఎలా ఉందో చూసి, మాకు ధైర్యం చెప్పి వెళ్తుండేవాడాయన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు పట్టించుకోరనీ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారనీ అనే మాటలు ఇలాంటి డాక్టర్ ల విషయంలో వర్తించవని అనుకున్నా.
ఒకవైపు రక్తం ఎక్కించడం, మరోవైపు సెలైన్ పెట్టడం, ఇంకోవైపు మందులు.. అన్నీ కలిపి అమ్మ త్వరగానే కోలుకున్నది. హిమోగ్లోబిన్ 7 కి వచ్చింది. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నారు మాతో పాటుగా డాక్టర్ లు. అమ్మ డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చింది. ప్రతిరోజూ బీట్రూట్ లు, క్యారెట్ లు పెట్టేవాళ్ళం. అవి తప్ప ఇక వేరే కూరగాయల జోలికి వెళ్లలేదు ఓ నెల రోజులు. అద్భుతం..! అమ్మ హిమోగ్లోబిన్ 11 కి వచ్చింది.
– మనస్విత, హైదరాబాద్