సిట్రస్ పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. కాబట్టి దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అల్జీమర్స్ లాంటి న్యూరలాజికల్ సమస్యల విషయంలో కూడా దానిమ్మ బాగా పనిచేస్తుందంటున్నాయి ఇటీవలి అధ్యయనాలు.
రోగ నిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చేసే దానిమ్మ ఇంకా ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. మతిమరుపు తగ్గించడంలో కూడా దానిమ్మ ముందుంది అంటున్నాయి తాజా పరిశోధనలు. దానిమ్మలో ఉండే ఎలాజిక్ యాసిడ్, ఆంథోసయనిన్స్, పునికాల్జిన్ వంటి రసాయనాలు ఇందుకు ఉపయోగపడుతాయని ఈ అధ్యయనాల్లో వెల్లడైంది. పునికాల్జిన్ అనే రసాయనం మెదడులో ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడకుండా నివారిస్తుంది. అందువల్ల ఇది పుష్కలంగా ఉన్న దానిమ్మ ఎక్కువగా తింటే అల్జీమర్స్, పార్కిన్‌సన్స్ లాంటి నాడీ సంబంధ జబ్బులు రాకుండా నివారించడానికి, వచ్చినా వాటి పురోగతిని అడ్డుకోవడానికి పనిచేస్తుంది. మెదడులో స్ఫటికాలు పేరుకుపోవడం అల్జీమర్స్‌కు ఒక కారణం. వీటిని విడగొట్టడంలో దానిమ్మలోని రసాయనాలు పనిచేస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతున్నది.
దానిమ్మలోని పాలీ ఫినాల్స్, ఫైబర్, పునికాల్జిన్స్ కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి. తద్వారా గుండెజబ్బుల నుంచి రక్షిస్తాయి. దీనిలోని పోషకాలు మలబద్దకాన్ని నివారించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజుకి ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకుంటే టెస్టోస్టిరాన్ స్థాయి పెరిగి, పురుషుల్లో శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది. లైంగిక పటుత్వమూ వృద్ధి చెందుతుంది. దానిమ్మలో సి విటమిన్ పుష్కలం. కాబట్టి ఇది చర్మంపై ముడుతలను వాయిదా వేస్తుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండటానికి దోహదం చేస్తుంది. ఒత్తిడి తగ్గించడంలో కూడా దానిమ్మ ముందుంటుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిజోల్ స్థాయిని తగ్గిస్తున్నట్టు మరో అధ్యయనంలో వెల్లడైంది. అందుకే వీలైనంత ఎక్కువగా దానిమ్మ తీసుకుంటే అనేక రకాలుగా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.