తరచుగా జలుబు అవుతున్నదా..? చక్కెర వ్యాధి ఉందా..? బరువు తగ్గాలా…? అయితే ఈ పండు తినండి అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
జలుబు.., దగ్గు.. చలికాలంలో కామన్ గా, ప్రతి ఒక్కరినీ బాధించే సమస్యలు. ఈ సీజన్ అయిపోయేలోపు వీటి బారిన పడని వాళ్లుండరు. అందుకే సీజనల్ గా వచ్చే ఈ సమస్యల నుంచి దూరంగా ఉండటం కోసం ఇమ్యూనిటీ పెంచే పండ్లనూ ఇచ్చింది నేచర్. ఈ పండ్లు సీజనల్ వ్యాధుల నుంచే కాదు.. డయాబెటిస్ బాధ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. దోరదోరగా ఊరించే ఆ పండేంటంటే…
దోరదోరగా పండిన జామకాయలంటే ఇష్టపడని వారుండరు. చాలా చవకగా ఆరోగ్యాన్ని సంపాదించుకోడానికి జామపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. వంద గ్రాముల జామపండులో 68 కేలరీలు ఉంటాయి. జామలో పోషకాలకు కొదవే లేదు.
డయాబెటిస్ ఉంటే…
జామ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవారు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. పీచుపదార్థాలు చాలా ఎక్కువ కావడం వల్ల ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పీచుపదార్థాలే ఒంట్లో చక్కెరను నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. అందువల్ల కూడా ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఉపయుక్తమైన పండుగా పేరొందింది. జామపండ్లను తినేవారిలో పంటి, చిగుర్లకు సంబంధించిన వ్యాధులు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకునేవారికి జామ అనేక విధాల తోడ్పడుతుంది. ఇందులోని తక్కువ చక్కెర పాళ్లు, పీచు వంటి అంశాలు వేగంగా బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
ఇమ్యూనిటీ పెంచేది
జామలో విటమిన్-సి చాలా ఎక్కువ. ఇది చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ కావడంతో వ్యాధి నిరోధకత పెంచడం ద్వారా ఎన్నో వ్యాధులను నివారిస్తుంది. జామపండులో విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అవి మెదడులోని న్యూరాన్ల పనితీరును మెరుగుపరుస్తాయి. అందువల్ల జామపండు తినేవారిలో మెదడు చురుగ్గా ఉంటుంది. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి జబ్బులను నివారించడానికి కూడా జామ తోడ్పడుతుంది. అందుకే రోజూ జామపండు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.