జ్వరం.. మెల్లగా దగ్గు మొదలు.. ఆర్టీ పీసీ ఆర్ టెస్ట్ లో నెగెటివ్. కానీ రోజురోజుకీ లక్షణాలు పెరిగితే.. ఏం చేయాలి..? అసలు కరోనా ఉన్నట్టా లేనట్టా.. ? ఇలాంటప్పుడు ఆక్సిమీటర్ లో ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకోవడం ఒక్కటే మార్గం. ఆరు నిమిషాల పాటు నడిచి చెక్ చేసుకోవడం వల్ల హాస్పిటల్ ఎప్పుడు వెళ్లాలో కరెక్ట్ గా తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
కరోనా వైరస్ నేపథ్యంలో వైద్యులు ఆరు నిమిషాల నడక పరీక్షను సూచిస్తున్నారు. నడుస్తూ పల్స్ ఆక్సీ మీటర్ సాయంతో మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తెలుసుకుని.. అత్యవసరమని భావిస్తే హాస్పిటల్‌లో చేరాలని తెలుపుతున్నారు.
మొన్నటి వరకూ ఉచితంగా పీల్చుకున్న ప్రాణవాయువు ఇప్పుడు లక్షలు పోస్తే గానీ రాని పరిస్థితి. కరోనా తో కుప్పకూలినా హాస్పిటల్ లో బెడ్ దొరకాలంటే కష్టం. అనవసర భయాలతో ఎప్పుడు హాస్పిటల్ వెళ్లాలో తెలియకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి ఎదురైంది. అందుకే సరిగ్గా ఆక్సిజన్ చెక్ చేసుకోవడం ఎలాగో చూద్దాం.
ఒక వేళ మీకు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నా లేదా ఆ లక్షణాలు కనిపిస్తున్న తప్పకుండా పల్స్ ఆక్సీమీటర్‌ను మీ వద్ద ఉంచుకోండి. దీని ద్వారా మీరు మీ శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండవచ్చు. పల్స్ ఆక్సీ మీటర్‌ను చేతి వేలుకు పెట్టుకోవడం ద్వారా ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. పల్స్ ఆక్సీమీటర్‌లో కనిపించే SpO2 శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను సూచిస్తుంది. అయితే నార్మల్ గా చేసే టెస్ట్ తో పాటు ఆరు నిమిషాల నడక పరీక్ష కూడా అవసరం. ఆరు నిమిషాల నడక ద్వారా ఊపిరితిత్తుల పనితీరు గురించి తెలుసుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.
టెస్ట్.. ఇలా చేయండి !
ముందుగా పల్స్ ఆక్సీమీటర్‌ను మీ చూపుడు వేలుకు ధరించండి. తర్వాత ఎంత శాతం ఆక్సిజన్ ఉందో నమోదు చేసుకోండి. ఇప్పుడు ఆరు నిమిషాల నడక టెస్ట్ చేయాలి. అదెలాగంటే.. వేలికి ఆక్సీ మీటర్ అలాగే ఉంచుకుని ప్లేన్ ఉపరితలం మీద ఆరు నిమిషాల పాటు మధ్యలో ఆగకుండా నడవాలి. నడిచిన తర్వాత కూడా ఆక్సిజన్ స్థాయిలో మార్పు లేకపోతే మీకు ప్రమాదం లేనట్టే. కొందరిలో ఒకట్రెండు శాతం తగ్గినట్టు అనిపిస్తే ఈ టెస్టును రెండుసార్లు చేసి చూడండి.
ఆక్సీమీటర్ రీడింగ్ 94 కంటే ఎక్కువ నమోదైతే ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగా ఉన్నట్లే. రీడింగ్ 94 కంటే తక్కువగా నమోదైతే మాత్రం ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నట్లు తెలుసుకోవాలి. తక్కువ ఆక్సిజన్ శాతం నమోదైతే తప్పకుండా హాస్పిటల్ కి వెళ్ళాలి. మీ ఆరోగ్యపరిస్థితిని బట్టి వైద్యులు కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తారు.
ప్రస్తుతం కరోనాతో ఐసోలేషన్‌లో ఉన్నవారు తప్పకుండా తమ ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. నడక పరీక్షతో హాస్పిటల్ కి కచ్చితంగా ఎప్పుడు వెళ్ళాలి అనేది తెలుస్తుంది. కాబట్టి. రోజుకి రెండు మూడు సార్లు ఈ పరీక్ష చేసుకుంటుంటే ఆర్ టీ పీసీ ఆర్ టెస్ట్ ఫలితంతో సంబంధం లేకుండా మీ లక్షణాలు, ఆక్సిజన్ స్థాయిని బట్టి హాస్పిటల్ వెళ్ళవచ్చు.