మన పండుగలు ఏవైనా వాటిలో ఏదో ఒక ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంటుంది. ఇప్పుడు దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు బతుకమ్మ సంబరాలు, మరోవైపు నవరాత్రి వేడుకలు. నవరాత్రి, దుర్గాష్టమి సందర్భంగా చాలా మంది ఉపవాసాలు ఉంటారు. కొందరు మొత్తం తొమ్మిది రోజులూ ఉపవాసం ఉంటే కొందరు ఆఖరి రెండు రోజులు ఉంటారు.
నిజానికి పండగ కోసమైనా, మరే కారణం అయినా అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం మంచిదే. ఉపవాసం డీటాక్సింగ్ ప్రక్రియ గా పని చేస్తుంది. శరీరం లోని మలినాలను తీసివేస్తుంది. జీర్ణ ప్రక్రియకు పనికొచ్చే జఠరాగ్ని ఉత్తేజితం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగితే శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలు సమర్థవంతంగా బయటికి వెళ్లిపోతాయి.
ఉపవాసంతో లాభాలెన్నో !
మలబద్దకం ఉండదు. తద్వారా మనం మరింత చురుగ్గా ఉండగలుగుతాం.
మలినాలన్నీ పోతే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
ఉపవాసం వల్ల కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది.
చర్మం నిగారింపుకి దోహదపడుతుంది.
శరీరం శక్తి సంతరించుకుంటుంది.
ఉపవాసం ఉన్నప్పుడు ఇవి మరవొద్దు..
చాలా మంది ఆకలి కావొద్దని రోజంతా టీ, కాఫీల తోనే కడుపు నింపుతుంటారు. కానీ ఖాళీ కడుపుతో ఇవి తాగొద్దు.
కడుపు ఖాళీగా ఉన్నప్పుడు నిమ్మ రసమో, వెజిటబుల్ జ్యూస్ గాని తీసుకోవడం మంచిది.
ఏవైనా మందులు వాడుతున్నప్పుడు ఉపవాసం చేయవద్దు.
గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఉపవాసం ఉండొద్దు.
దాండియా లేదా గర్భా డాన్సు చేసిన తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
ఉపవాసంలో ఇవి తినండి
గింజలు : ఉపవాసాలున్నప్పుడు సాధారణంగా అన్నం, రొట్టె మానేస్తారు. కాబట్టి, బుక్వీట్ (ఒక రకమైన గోధుమలు), ఊదలను డైట్ లో యాడ్ చేయాలి. బుక్వీట్ పిండి, వాటర్ చెస్ట్ నట్ గింజల పిండి లేదా ఉసిరి కాయ పొడి లాంటివి వాడవచ్చు. సగ్గుబియ్యంతో చేసిన కిచిడీ కూడా పోషకాహారంగా పనిచేస్తుంది.
పండ్లు : అన్నీ రకాల పండ్లు తినవచ్చు.
కూరగాయలు : వీటిని ఉడికించి గానీ, స్టీమ్ చేసి గాని తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆలుగడ్డలు, చిలగడా దుంపల వంటివి ఉడికించి తీసుకోవాలి.
పాలు, పాల పదార్థాలు : పాలు, పెరుగు, పనీర్, నెయ్యి వంటివి ఉపవాసంలో ప్రోటీన్లను అందించే పదార్థాలు.
ఉప్పు : సలాడ్స్ లాంటి వాటిలో వేసుకోవచ్చు.
సాధారణంగానిలవ చేసినవి, ప్రాసెస్ చేసిన పదార్థాలేవీ ఉపవాసంలో తినొద్దు. లెగ్యూమ్స్, పప్పులు ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.