పెళ్లయి నాలుగేళ్లయినా పిల్లలు పుట్టక బాధపడుతున్నారా… పరీక్షలన్నీ నార్మల్ ఉన్నాయా..? అయితే ఒకసారి మీ రోజువారీ జీవనశైలి మీద దృష్టి పెట్టమంటున్నారు పరిశోధకులు. పెరుగుతున్న ఒత్తిడి కూడా సంతాన లేమి సమస్యను తెచ్చిపెడుతున్నదంటున్నారు. అందుకే పిల్లలు కావాలంటే ఒత్తిడి నుంచి బయటపడమని సూచిస్తున్నాయి ఇటీవలి అధ్యయనాలు.
సంతానలేమి సమస్య ఇటీవలి కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది. నాగరికత పేరుతో పాశ్చాత్య జీవనశైలికి అలవాటు పడటం వల్ల మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. దాంతో అధిక బరువు దాంతో పాటు హార్మోన్ల సమస్యలూ వచ్చిపడుతున్నాయి. దీనికి తోడు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఈలోగా పుణ్యకాలం కాస్తా అయిపోయి, పిల్లల్ని కనే వయసు దాటిపోవడం సంతానలేమి సమస్యను పెంచుతున్నది. దీనికి తోడు సంపాదన కోసం పరుగులు, కెరీర్లో నిలదొక్కుకోవడం కోసం ఉరుకులు… ఏ పనైనా క్షణాల మీద అయిపోవాలన్న ఫీలింగ్, అలా జరుగకపోతే ఆందోళన. ఇలాంటివన్నీ మానసిక, శారీరక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ ఒత్తిడి కూడా సంతానలేమి సమస్య పెరగడానికి కారణమవుతున్నదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఇటీవల సంవత్సరం పాటు 4 వందలకు పైగా మహిళలపై ఈ విషయంలో అధ్యయనాలు నిర్వహించింది ఓహియో స్టేట్ యూనివర్సిటీ. ఈ అధ్యయనంలో ఒత్తిడికీ, సంతానలేమికీ సంబంధం ఉన్నదని తేలింది. లాలాజలంలో ఆల్ఫా అమైలేజ్ అనే స్ట్రెస్ బయోమార్కర్ అధిక మోతాదులో ఉండటమే ఇందుకు కారణమని స్పష్టమైంది. ఈ బయోమార్కర్ ఎక్కువగా ఉన్నవాళ్లు గర్భం దాల్చే అవకాశం 29 శాతం తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేల్చారు పరిశోధకులు. ఒత్తిడి ఎక్కువగా ఉండేవాళ్లలో ఆల్ఫా అమైలేజ్ ఎక్కువగా ఉండటం వల్లనే వాళ్లలో పిల్లలు పుట్టడం కష్టమవుతున్నదని చెబుతున్నారు. అందుకే సంతానం కలుగడం లేదన్న బాధతో కుమిలిపోయే కన్నా ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు.