వ్యాయామం చేయాలంటే జిమ్‌లకే వెళ్లక్కర్లేదు.. సింపుల్‌గా వాకింగ్ చేసినా చాలు. కానీ అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్లకు మాత్రం వాకింగ్ ఒక్కటే సరిపోదు. బరువుకు తోడు మధుమేహం కూడా ఉంటే తప్పనిసరిగా స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజులు, వెయిట్ బేరింగ్ వ్యాయామాలు చేస్తే మరింత మంచి ఫలితాలుంటాయంటున్నాయి కొత్త పరిశోధనలు.
ఇప్పుడిప్పుడే వ్యాయామం మొదలుపెడుతున్నవాళ్లు, వృద్ధులు, కీళ్లనొప్పులు ఉన్నవాళ్లు, తీవ్రస్థాయి వ్యాయామం చేయలేనివాళ్లు వాకింగ్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది. కానీ బరువు తగ్గాలన్నా, రక్తంలో చక్కెరలు తగ్గాలన్నా బరువులెత్తడమే మంచి ఉపాయం అంటున్నారు పరిశోధకులు. మధుమేహంతో బాధపడుతున్న ఊబకాయులకు వెయిట్ట్రెయినింగ్, శక్తినిచ్చే వ్యాయామాలు రెండూ ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు బ్రెజిల్శాస్త్రవేత్తలు. నడక లాంటి వ్యాయామాలే మధుమేహానికి చాలనుకుంటున్న తరుణంలో బ్రెజిల్‌కి చెందిన కంపినాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త విషయాన్ని చెప్తున్నారు. బరువులు ఎత్తడం వల్ల శరీరంలోని కొవ్వు మాత్రమే కాదు, కాలేయంలోని ఫాట్ కూడా కరిగిపోతుంది. ఊబకాయులు ఎంతగా బరువులెత్తితే కాలేయంలో పేరుకున్న కొవ్వు అంతగా తగ్గిపోతుందని, దాంతో రక్తంలోని చక్కెర మోతాదులు నియంత్రణలోకి వస్తాయని వీరు అంటున్నారు. ఎలుకల్లో చేసిన పరిశోధన ద్వారా ఈ విషయం చెప్తున్నారు సైంటిస్టులు. మరిక జిమ్ కి వెళ్లేందుకు తయారవండి.
యవ్వనంలో ఉన్నప్పుడే జిమ్‌కి వెళ్లి బరువులెత్తడం, స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజులు చేయడం మొదలుపెడితే మధుమేహాన్ని నివారించేందుకు వీలుంటుంది. చిన్నవయసులోనే మధుమేహం ఉన్నవాళ్లు కూడా ఇలాంటి వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మధుమేహాన్నికంట్రోల్లో పెట్టుకోవచ్చు. అధిక బరువు తగ్గించుకోవచ్చు. అయితే జిమ్‌కి వెళ్లే అవకాశం, సమయం లేనప్పుడు ఏదీ చేయకుండా ఉండే బదులు ఏదో ఒక వ్యాయామం చేయడం బెటర్. కనీసం వాకింగ్ అయినా చేయాలి. ఇంట్లో చేసే యోగా కూడా మంచిదే.