వృద్ధాప్యాన్ని ఆపొచ్చా?

కాలం, వయసు రెండూ ఒకేలాంటివి. ఒకసారి ముందుకెళితే మళ్లీ వెనక్కి రావు. కాని చాలా రకాల చికిత్సలతో ముదిరిన వయసును యవ్వనంగా మారుస్తున్నారు. ఈ విషయాలెలా ఉన్నా అసలు వృద్ధాప్యం ఎందుకు వస్తుందనే కోణంలో అనేక పరిశోధనలు జరిగాయి. సుదీర్ఘకాలం పాటు నిర్వహించిన ఈ పరిశోధనల్లో వెల్లడైన అంశాలను “సైన్స్ ఆఫ్ ఏజింగ్” పేరుతో వివరించారు శాస్త్రజ్ఞులు. వృద్ధాప్యం రావడానికి వాళ్లు చెప్పిన కారణాలేంటో, దాన్ని ఆపడం సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం.

వయసు మీదపడుతున్న కొద్దీ మన శరీరంలోని వ్యవస్థల పనితీరులో అనేక మార్పులు జరుగుతుంటాయి. వృద్ధాప్యం పెరిగే క్రమంలో మన శరీరంలో జరిగే ప్రధానమైన ప్రక్రియల గురించి సవివరంగా చెప్పారు శాస్త్రవేత్తలు. ఆ మార్పులు ప్రతి వ్యక్తిలోనూ తప్పనిసరిగా జరుగుతాయని స్పెయిన్‌లోని క్యాన్సర్ పరిశోధనా కేంద్రానికి చెందిన పరిశోధకులు అంటున్నారు. కాకపోతే, మన జీవన విధానం, జన్యు సంబంధమైన కారణాల వల్ల కొందరిలో కాస్త ముందుగా, మరికొందరిలో కాస్త ఆలస్యంగా జరగొచ్చని చెప్తున్నారు.

జన్యు అస్థిరత

వయసు పెరుగుతున్న కొద్దీ మన కణాల్లోని డీఎన్‌ఏ‌లో మార్పులు కలుగుతాయి. డీఎన్‌ఏ మన శరీరంలోని కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే కోడ్ లాంటిది. అయితే, వయసు పెరిగే కొద్దీ ఆ సమాచార మార్పిడిలో పొరపాట్లు పెరుగుతాయి. ఆ పొరపాట్లన్నీ కణాల్లో నిండిపోయి ఉంటాయి. దీన్ని జన్యు అస్థిరత లేదా జీనోమిక్ ఇన్‌స్టెబిలిటీ అంటారు. అలా డీఎన్‌ఏ లో మార్పుల వల్ల మూల కణాల పనితీరుపై ప్రభావం పడుతుంది. దాంతో కణాల పునరుద్ధరణ ప్రక్రియ దెబ్బ తింటుంది.

క్రోమోజోమ్ లు అరిగితే.. అంతే!

వయసుతో పాటు జరిగే మరో ప్రక్రియ క్రోమోజోమ్‌లు అరిగిపోవడం. ప్రతి క్రోమోజోమ్ చివర టీలోమరేజ్ అనే రక్షణ కవచం ఉంటుంది. వయసు మీద పడే కొద్దీ ఆ కవచాలు అరిగిపోతాయి. దాంతో క్రోమోజోమ్‌లకు రక్షణ లేకుండా పోతుంది. దీని ప్రభావం వృద్ధాప్యం పై ఉంటుంది. పల్మనరీ ఫైబ్రోసిస్, అప్లాస్టిక్ అనీమియా లాంటి జబ్బులకు క్రోమో‌జోమ్‌ల రక్షణ కవచాలు అరిగిపోవడానికి మధ్య సంబంధం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఆ జబ్బుల వల్ల కణాలు పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోతాయి. కణాల ప్రవర్తనలో మార్పు సంభవిస్తుంది. మన శరీరంలో కొన్ని ఎపీజెనెటిక్ అనే ప్రక్రియల వల్ల డిఎన్ఎ అమరిక ఎలా ఉండాలో నిర్దేశించబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని ఏ కణం ఎలా ప్రవర్తించాలో ఆదేశాలు వెళ్తాయి. అయితే వయసులో పెరుగుదల, జీవన విధానం కారణంగా ఈ ప్రక్రియ సజావుగా సాగదు. దాంతో కణాలకు తప్పుడు ఆదేశాలు వెళ్తుంటాయి. అప్పుడు ఆ కణాలు అవసరమైన విధంగా కాకుండా మరోలా ప్రవర్తిస్తాయి.

కణాల జీవక్రియపై ప్రభావం

వయసుతో పాటు కణాల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు అనువుగా మృత కణాలను ఎప్పటికప్పుడు బయటకు పంపే సామర్థ్యం మన శరీరానికి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఆ సామర్థ్యం తగ్గుతుంది. దాంతో మృతకణాలు అలాగే శరీరంలోనే ఉండిపోయి అల్జీమర్స్, పార్కిన్సన్స్, కళ్లల్లో పొరలు వంటి రుగ్మతలకు దారితీస్తాయి. కణాల జీవక్రియ పై నియంత్రణ తగ్గుతుంది. ఏళ్లు గడిచే కొద్ది కొవ్వులు, చక్కెర లాంటి పదార్థాలను ప్రాసెస్ చేసే సామర్ధ్యాన్ని కణాలు కోల్పోతాయి. దాంతో పోషకాలను కణాలు సరిగా జీర్ణం చేసుకోలేవు. ఇలాంటి పరిస్థితులే మధుమేహం లాంటి జబ్బులకు దారితీస్తాయి.

వయసు పెరుగుతున్న కొద్దీ మైటోకాండ్రియా పని మందగిస్తుంది. శరీరంలోని కణాలకు మైటోకాండ్రియా శక్తిని అందిస్తుంది. కానీ, వయసు పెరిగే రీత్యా వాటిలో క్రియాశీలత తగ్గుతూ వస్తుంది. అలా మైటోకాండ్రియా పూర్తిగా పనిచేయడం ఆగిపోయినప్పుడు డీఎన్‌ఏ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మైటోకాండ్రియాను బాగు చేయగలిగితే వృద్ధాప్యాన్ని ఎదుర్కోవడమే కాదు జీవిత కాలాన్ని పెంచొచ్చని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

మూలకణాలతో..

వృద్దాప్యంలో శరీరంలోని వివిధ కణాలు ముదిరిపోతాయి. ఒక కణం బాగా దెబ్బతిన్నప్పుడు అపరిపక్వ కణాల పుట్టుకను అడ్డుకునే పనిని ఆపేస్తుంది. అదే సమయంలో ఆ కణం వయసు పెరిగిపోతుంది. ఆ క్రమంలో అది ఇతర కణాల నాశనానికి కూడా కారణమవుతుంది. కణాల పునరుత్పాదన సామర్థ్యం తగ్గుదల అనేది వృద్ధాప్యానికి ప్రధానమైన లక్షణంగా చెబుతారు. వయసు మీదపడుతున్న కొద్దీ మూల కణాలు బలహీనపడి కణాల పునరుత్పాదనలో విఫలమవుతాయి. మూలకణాలను పునరుద్ధరించడం ద్వారా త్వరగా వృద్ధాప్యం రాకుండా చేసే వీలుంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కణాల మధ్య సమాచార మార్పిడి ఆగిపోతుంది. మన శరీరంలోని కణాల మధ్య నిత్యం సమాచార మార్పిడి జరుగుతుంది. అయితే, ఏళ్లు గడిచే కొద్దీ ఆ సమాచారం అందిపుచ్చుకునే సామర్ధ్యం తగ్గుతుంది. అది నొప్పికి దారితీస్తుంది. దాంతో కణాల మధ్య సమాచార మార్పిడి ఆగుతుంది. సమాచార మార్పిడి జరగడం లేదంటే వాటి ప్రవర్తన, పనితీరులోనూ తేడాలు వస్తాయి.

పెరిగే వయసును ఇలా ఆపవచ్చు

వృద్ధాప్యాన్ని ఆపొచ్చా అనేది పరిశోధకుల మెదడులో నిత్యం నలుగుతున్న ప్రశ్న. శరీరంలో జరిగే ఈ మార్పులకు పరిష్కారాలు కనుగొనగలిగితే వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసేలా ముందడుగు వేసేందుకు అవకాశం ఉంటుందని ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు అంటున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానంతో కొంతమేరకు పరిష్కారం దొరుకుతుందని కూడా సూచిస్తున్నారు. పోషకాలతో కూడిన మంచి ఆహారం తీసుకోవడం, అవసరమైనంత మేర శారీరక శ్రమ చేయడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించడం ద్వారా చాలావరకు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు.

Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *