ఒకవైపు ఏడాదిన్నరగా పాఠశాలలకు దూరమై అటు చదువులూ.. ఇటు స్నేహితులూ.. అన్నింటికీ.. అందరికీ దూరంగా ఇంట్లో బంధీలై బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు… మరోవైపు పిల్లలపై దాడి చేయడానికి థర్డ్ వేవ్ వచ్చేస్తోందన్న భయం.. వీటిమధ్య కొట్టుమిట్టాడుతున్న పెద్దలు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? మన పిల్లల్ని రక్షించుకోవడం ఎలా? అసలు నిజంగా ఈ థర్డ్ వేవ్ పిల్లలనే టార్గెట్ చేసుకుంటూ వస్తున్నదా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే ఇది చదవాల్సిందే.

కొవిడ్ వచ్చిన కొత్తలో.. పిల్లల వ్యాధి నిరోధక వ్యవస్థ వేరు.. కాబట్టి వాళ్లు సేఫ్… అనే నిమ్మళం నుంచి ఇప్పుడు… అమ్మో… థర్డ్ వేవ్… ఈ సారి పిల్లలకే ఎక్కువగా వస్తుందట… అనే భయంలోకి వచ్చాం. కొవిడ్ మనల్ని అంతగా బలహీనుల్ని చేసింది. కరోనా మూడో వేవ్ ఇప్పటికే కొన్ని దేశాల్లో, ప్రాంతాల్లో మొదలైందంటున్నారు. ఈ నేపథ్యంలో మరి మన పిల్లలు సేఫేనా? ఈసారి కొవిడ్ పిల్లలపై దాడి చేస్తుందన్నది నిజమేనా… అంటే అంత భయపడాల్సిన అవసరమేమీ లేదు. అలాగని అజాగ్రత్తగా ఉంటే మాత్రం ముప్పు కొని తెచ్చుకున్నట్టే.
కొవిడ్ పూర్తిగా కొత్త వైరస్. దాని గురించి ఇంకా పూర్తిగా మనకు తెలియదు. అయితే ఏదైనా సరే సూక్ష్మజీవి మన మీద దాడిచేసినప్పుడు మన కంట్రోల్ నుంచి తప్పించుకోవడానికి, దాని మనుగడ కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జన్యుపరంగా మార్పులు చెందుతూ దాని రూపురేఖలను మార్చుకుంటూ ఉంటుంది. అలా సెకండ్ వేవ్‌లో మనం బాగా దెబ్బతిన్నాం. ఇక పిల్లల విషయానికి వస్తే దీని ప్రభావం ఎలా ఉండబోతున్నదనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. చిన్నారులకు మొన్నటిదాకా వచ్చింది.. ఇప్పుడూ రావొచ్చు. కానీ తీవ్రస్థాయిలో ప్రాణాంతకం మాత్రం కాదు.
పిల్లల్లో ఎందుకంటే…
- కొవిడ్‌కి వాక్సిన్ వచ్చినప్పటికీ ఇంకా పిల్లలకు వాక్సిన్ ఇవ్వలేదు.
- ఇప్పటివరకు ఇన్‌ఫెక్షన్ పిల్లల్లో తక్కువ అనేది అంచనా. అయితే నిజంగా ఇన్‌ఫెక్షన్ రాలేదా.. మనం గుర్తించలేకపోయామా అనేది ప్రశ్న. ఇంట్లో వాళ్లకు వచ్చినప్పుడు టెస్టు చేయిస్తే పాజిటివ్ అని బయటపడటమే తప్ప చాలామంది పిల్లలకు లక్షణాలు లేవు. నిజంగా ఎంత మందికి ఇన్‌ఫెక్షన్ సోకింది అనేది తెలియదు. మన ఇండియన్ పిల్లల్లో 25 శాతం మంది ఇన్‌ఫెక్ట్ అయినట్టు ఓ అధ్యయనంలో బయటపడింది.
- పెద్దవాళ్లకు చాలామందిలో ఇంకా రెండు డోసులు పూర్తికాలేదు. అందువల్ల వాళ్లు ఇన్‌ఫెక్ట్ అయితే, ఇంట్లో పిల్లలకూ సోకేందుకు ఆస్కారం ఉంది.
- చాలామంది పెద్దలైనా, పిల్లలైనా మైల్డ్ ఇన్‌ఫెక్షన్‌కి కూడా భయపడి హాస్పిటల్‌లో చేరారు. అందువల్ల పిల్లల్లో కూడా తీవ్రంగా ఉందేమో అన్న భయం నెలకొంది.

భయం.. అసలే వద్దు
కొవిడ్ ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రీసెప్టార్లకు అతుక్కుని ఇన్‌ఫెక్షన్ కలిగిస్తుంది. కానీ పిల్లల్లో ఇవి తక్కువగా ఉండటం వల్ల వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటున్నది. మొదటి వేవ్‌లో వెయ్యి మందిలో ఒక చిన్నారిపై మాత్రమే ప్రభావం కనిపించింది. రెండోవేవ్‌కి వచ్చేసరికి వందమందిలో ఒకరుగా ఇన్‌ఫెక్ట్ అయ్యారు. కాబట్టి మూడోవేవ్‌లో ఇంకా ఎక్కువ మందికి వస్తుందని భయపడుతున్నారు. కానీ హాస్పిటల్‌లో చేరినవాళ్లలో 98 శాతం పెద్దవాళ్లే. పిల్లల్లో మరణాల రేటు కేవలం 0.1 శాతం. వీళ్లు కూడా కేవలం కొవిడ్ వల్ల మాత్రమే కాదు, ఇతరత్రా జబ్బులు ఉండి, కొవిడ్ ఇన్‌ఫెక్షన్ కూడా వచ్చినవాళ్లు. కాబట్టి ఈ మూడోవేవ్‌లో పిల్లలు పాజిటివ్ అయినప్పటికీ వారిలో వ్యాధి తీవ్రత మాత్రం ఉండే ప్రమాదం లేదు. కానీ ఆస్తమా, గుండెజబ్బు, పుట్టుకతో సమస్యలు, ఇమ్యునోడెఫీషియన్సీ వ్యాధులు, క్యాన్సర్ లాంటి ఇతర జబ్బులున్న పిల్లల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. స్థూలకాయం ఉన్న పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎలా సిద్ధం కావాలి?
- ఆటలకు దూరమైనా పిల్లల్ని శారీరకంగా ఫిట్‌గా ఉంచడం ముఖ్యం. నగరాల్లో అపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న చోట వ్యాయామం చేయాలి. ఇంట్లో యోగా చేయాలి. గ్రామాల్లో అయితే ఖాళీ ప్రదేశాలెక్కువ. భౌతిక దూరం పాటిస్తూ ఎక్సర్‌సైజ్ చేయాలి. లిఫ్ట్ బదులు మెట్లు వాడాలి.
- పిల్లలకు పోలియో, డిపిటి, మమ్స్, ఎంటిఆర్ లాంటివి తప్పనిసరిగా వేయించాలి. ఇవి వచ్చి, కొవిడ్ ఇన్‌ఫెక్షన్ వస్తే కష్టం. అంతేగాక వేరే వాక్సిన్ల వల్ల కూడా పరోక్షంగా నిరోధకత అవుతుందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
- నిద్ర చాలా ముఖ్యం. ఇప్పుడు పిల్లల్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో నిద్ర సరిగా ఉండటం లేదు. నిద్ర లేకపోతే జీవక్రియలు సక్రమంగా పనిచేయవు.
- పిల్లలకు పోషకాహారం ఇవ్వాలి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, ప్రొటీన్, శనగలు, రాజ్‌మా, చేప, కోడిగుడ్ల వంటి వాటితో బ్యాలెన్స్‌డ్ డైట్ ఉండేలా చూసుకోవాలి.

- పిల్లలంటే బయటికి పోవడం, ఆడుకోవడం, ఫ్రెండ్స్. కానీ నెలల తరబడి ఇంట్లో బంధీలయ్యారు. వాళ్లను ఏదో రకంగా ఎంగేజ్ చేయాలి. అందరూ కూర్చుని మాట్లాడుకోవడం, కథలు చెప్పడం, చదివించడం చేయాలి. ఆన్‌లైన్ మ్యూజిక్, డ్రాయింగ్, డాన్స్ క్లాసులు పెట్టించాలి. ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడించాలి.
- ఇంట్లో పెద్దలు వ్యక్తిగత, కుటుంబ, సామాజిక కారణాల వల్ల బయటికి వెళ్తుంటారు. వాళ్ల ద్వారా ఇన్‌ఫెక్షన్ రావొచ్చు. కాబట్టి ఇంట్లోవాళ్లందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలి.
- భౌతిక దూరం పాటించాలి. పిల్లలైనా, పెద్దలైనా మాస్క్ తీయొద్దు. సరిగా ధరించాలి. చేతులు శుభ్రం చేసుకోవాలి. బర్త్‌డే పార్టీలనీ, ఇతర సోషల్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చెయ్యాలి.
- పిల్లల బిహేవియర్‌ని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి స్కూల్స్ తెరవకపోవడమే మంచిదిని నా వ్యక్తిగత అభిప్రాయం. కొద్ది వారాలాగి ఏ రకమైన ప్రభావముందో గమనించాలి. ఆ తర్వాత ఒక్కసారిగా అందరికీ కాకుండా విడతల వారీగా ఓపెన్ చేస్తే మంచిది.
టీచర్లందరికి వ్యాక్సినేషన్ చేయించాలి.
సెకండ్‌వేవ్ పరిణామాలతో జాగ్రత్త!
ఏదైనా సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశిస్తే శరీరం రియాక్ట్ అవుతుంది. యాంటీబాడీలు ఉత్పత్తి అయినప్పుడు ఇవి మళ్లీ మళ్లీ ఉత్పత్తవుతాయి. ఇలాంటప్పుడు అవి ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తాయి. కొంతమందిలో ఇందుకు జెనెటిక్ కారణాలు ఉండొచ్చు. ఇలాంటి రియాక్షన్ వల్ల సెకండ్ వేవ్‌లో చాలామంది పిల్లల్లో మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్) కనిపించింది. ఇది కొవిడ్ ద్వారా నేరుగా వచ్చింది కాదు. దాని తర్వాత కొన్ని వారాల తర్వాత 3, 4 వారాల తర్వాత శరీరంలో వచ్చే రియాక్షన్. అయితే చాలామంది ఈ పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ నుంచి కూడా బయటపడ్డారు.
కొవిడ్ వచ్చిన మూడు నాలుగు వారాల తర్వాత హై గ్రేడ్ ఫీవర్, కళ్లు ఎరుపెక్కడం, దద్దుర్లు, నోట్లో పొక్కులు, తీవ్రమైన అలసట, ఆయాసం, బ్రెత్‌లెస్‌నెస్, బాగా నీరసం, పొట్టలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. నిర్దుష్టమైన చికిత్సతో ఈ సమస్యలు తగ్గుతాయి.

పీడియాట్రీషియన్ అండ్ నియొనాటాలజిస్ట్
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
హైదరాబాద్
Nice article… 🙏🙏🙏🙏
thank you bhaskar
very good information.
thank you sir