చలిలో చంటిబిడ్డలు భద్రం!

చలికాలం రానేవచ్చింది. ఒకవైపు కొవిడ్‌ భయం పోనేలేదు.. మరోవైపు ఇతరత్రా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లను మోసుకొచ్చే చల్లగాలులు వీస్తున్నాయి.  పొద్దంతా ఎండ వచ్చినప్పటికీ సాయంకాలమయ్యేసరికి చలి పెరుగుతున్నది. మనకే ఈ చలి ఇలా ఉంటే ఇక బుజ్జిపాపాయిలకు ఎలా ఉండాలి? ఈ సీజన్‌లో పసిపిల్లలకు శ్వాసకోశాలకే కాకుండా రకరకాల ఇన్‌ఫెక్షన్లు సులువుగా వచ్చిపడుతుంటాయి. ఇలాంటప్పుడు వాళ్లను మరింత భద్రంగా చూసుకోవడం అవసరం.

చలికాలంలో గాలిలో తేమ, మంచు ఎక్కువగా ఉండటం వల్ల శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లతో పాటుగా, చెవి, ముక్కు, గొంతు ఇన్ ఫెక్షన్లు ఎక్కువ. 90 శాతం చర్మం ఇన్ ఫెక్షన్లు ఫంగస్‌ వల్లనే వస్తాయి.  వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు హైపోథర్మియా పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు చెవి, ముక్కు, గొంతు, శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లు ప్రబలుతాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారిపోయి, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యంగా చంటి పిల్లలను చలికి ఎక్స్ పోజ్ కానివ్వొద్దు. సాయంత్రం కాగానే వెచ్చగా దుప్పటి కప్పాలి. సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం, తగినంత నిద్ర అవసరం.

చికిత్స ఇదీ

శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇన్ ఫెక్షన్లు, ముక్కు సంబంధిత ఇన్ ఫెక్షన్లు, న్యుమోనియా లాంటి వాటిలో బాక్టీరియా, వైరల్ ఇన్ ఫెక్షన్లు రెండూ ఉంటాయి. బాక్టీరియా అయితే యాంటి బయాటిక్స్, వైరల్ అయితే డీకంజెస్టెంట్స్ ఇస్తారు. చర్మం ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే చర్మంపై తేమ పోకుండా చూసుకోవాలి. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వల్ల వచ్చే ఫంగల్ ఇన్ ఫెక్షన్లను నివారించడానికి స్నానం కాగానే కొద్దిగా తడి ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయాలి. స్నానానికి ముందు కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ చర్మానికి పట్టిస్తే మరింత మంచిది.

ఆస్తమా, అడినాయిడ్స్, అలర్జీలు ఉంటే ఎలా జాగ్రత్తపడాలి?

సహజంగానే పిల్లల్లో అలర్జీలు ఎక్కువ. అందుకే చలికాలంలో రెస్పిరేటరీ అలర్జీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలర్జీకి లోనయ్యే శరీర తత్వం ఉన్నపిల్లలకు అడినాయిడ్స్, టాన్సిల్స్, సైనసైటిస్ లాంటి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ అలర్జీలు వంశపారంపర్యంగా కూడా రావొచ్చు. వాతావరణ కాలుష్యాన్ని అవాయిడ్ చేయలేం. అందుకే పిల్లల్ని సాధ్యమైనంత వరకు బయట చల్లగాలిలోకి వెళ్లనివ్వవద్దు. అలర్జీకారక పదార్థాలైన దుమ్ము, పొగ, పడని వస్తువులకు దూరంగా ఉంచాలి. సమస్య ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్టయితే డాక్టర్ ని కలిసి తగిన చికిత్స ఇప్పించాలి.

ఆహారం

చంటిపిల్లలకు ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే తల్లిపాలే సరైన మందు. బాలింతలు కూడా పోషకాహారాన్ని తీసుకోవాలి. కొంతమంది తల్లికి పథ్యం పెడుతుంటారు. ఇలాంటివి వద్దు. అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. సమతులాహారం తీసుకోవాలి. పడే వస్తువులన్నీ ఇవ్వాలి. మూడు నాలుగు గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా ఇవ్వాలి.

డాక్టర్‌ సతీశ్‌ ఘంటా
పిల్లల వైద్య నిపుణులు, డైరెక్టర్
లిటిల్‌ స్టార్స్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్, హైదరాబాద్
Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *