మీరు మార్నింగ్ రోజూ బ్రేక్ ఫాస్ట్ చేస్తారా? అయితే చాలా మంచి అలవాటండీ. కానీ వరల్డ్ వైడ్ గా 30 శాతం మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లేదట. మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ తినడానికి కూడా టైం లేకుండా పరుగులు పెడుతుంటారు. అలా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మానేసి పరుగులు పెడితే చివరికి ఏ డయాబెటిస్ దగ్గరో ఆగిపోవాల్సి వస్తుంది. ఇది నా మాట కాదండోయ్. రీసెంట్ గా జరిగిన స్టడీస్ మాట.
మార్నింగ్ టైంలో టిఫిన్ చేయడం రోజు మొత్తంలో తీసుకునే అతి ముఖ్యమైన ఆహారం. తరచుగా బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే డయాబెటిస్ వచ్చే అవకాశం 33 శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి కొందరు వారంలో నాలుగు రోజులు అసలు పొద్దున టిఫినే ముట్టరు. ఇలాంటివారిలో ఈ రిస్కు 55 శాతం ఎక్కువగా ఉంటుంది. లక్ష మందిలో చేసిన ఓ స్టడీలో ఈ విషయం తేలింది. ఉదయం పూట ఏమీ తినకపోతే సాధారణంగా మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కువగా తినేయడమే ఇందుకు కారణమట. అందుకే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తినాలి.
నాజూగ్గా మారాలని తిండి మానేస్తుంటారు చాలామంది. ఉదయం పూట టిఫిన్ మానేస్తే బరువు తగ్గిపోతామని అపోహ పడుతుంటారు. రోజులో తీసుకునే కేలరీల సంఖ్య తగ్గించవచ్చని అనుకుంటారు. కానీ ఆ తరువాత తీసుకునే ఆహారంలో కేలరీల సంఖ్య ఆటోమేటిగ్గా పెంచేస్తుంటారు. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తే మాత్రం బరువు ఎక్కువగా లేకపోయినా డయాబెటిస్ వచ్చే అవకాశం 22 శాతం ఉంటుందని రీసెర్చ్ ఫలితాలు చెప్తున్నాయి.