సమ్మర్ లో కూల్ డ్రింక్స్ తాగడం, ఐస్ క్రీమ్ లు తీసుకోవడం అందరూ చేసేదే. వేసవి ఎండల వేడి నుంచి ఉపశమనం కోసం చల్ల చల్లని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకోవాలనుకుంటాం. కానీ ఇక్కడే మనం పప్పులో కాలేస్తాం. మరి సమ్మర్ లో వీటిని తీసుకోవద్దా? ఒకవేళ తీసుకుంటే.. ఏమవుతుంది?
బిర్యానీ తినగానే ఓ కోక్ తీసుకోవడం మనలో చాలామందికి అలవాటే. ఇక సమ్మర్ లో అయితే వేసవి తాపాన్ని తగ్గిస్తాయని కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇదంతా మన భ్రమే! అసలే ఎండల వేడికి మన శరీరంలోని నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. దాంతో తరచుగా డీహైడ్రేట్ అవుతూ ఉంటాం. వడదెబ్బ వల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురవడం ఈ వేసవిలో అతి సాధారణంగా కనిపించే సమస్య. కొన్నిసార్లు ఇది ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు.
అసలే ఎండల వల్ల డీహైడ్రేట్ అయిన శరీరానికి నీళ్లు అందించడానికి బదులు, శరీరంలో మిగిలి ఉన్న నీటిని కూడా ఆవిరయ్యేలా చేయడం వివేకం కాదు కదా. కానీ కూల్ డ్రింక్స్ తాగడం ద్వారా మనం ఇదే పని చేస్తున్నాం. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం ద్వారా శరీరం డీహైడ్రేట్ అవుతుందని డాక్టర్లు తరచుగా హెచ్చరిస్తూనే ఉంటారు.
కూల్ డ్రింక్స్ మాత్రమే కాదు.. ఐస్ క్రీమ్స్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. నోటికి చల్లగా తగిలే ఐస్ క్రీమ్ లోపలికి వెళ్లాక మాత్రం వేడి చేస్తుంది. కూల్ డ్రింక్స్ గానీ, ఐస్ క్రీమ్స్ గానీ అతిగా తీసుకుంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అప్పటికే కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లయితే అసలు తీసుకోకపోవడమే మంచిది.
ఇకపోతే, వీటివల్ల డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా, శరీర బరువు పెరిగి, ఒబేసిటీ సమస్య వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లలో కేలరీలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఒక్క సిప్ చేసినా కేలరీలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. ఈ కేలరీలు కొవ్వులుగా నిల్వ ఉండిపోతాయి. అందుకే వీటివల్ల అధిక బరువు, మధుమేహ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కూల్ డ్రింక్స్ జీర్ణ శక్తిని తగ్గిస్తాయి. పైగా అసిడిటీ సమస్యను తీసుకొస్తాయి. అందుకే అసలే గ్యాస్, అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు కూల్ డ్రింక్స్ తాగితే మరింత ఇబ్బంది పడుతారు.
కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. ఫాస్ఫారిక్ యాసిడ్ ఉండే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది. మెనోపాజ్ దశలోకి చేరిన మహిళలకు ఇది మరింత ప్రమాదం. ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్లయితే కూల్ డ్రింక్స్ ను అసలు తాగకపోవడమే మంచిది.
వేసవిలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ బదులుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవడం అన్ని రకాలుగా ఆరోగ్యకరం. ఎండలో బయటికి వెళ్లినప్పుడు మంచినీళ్ల బాటిల్ తో పాటుగా మజ్జిగ కూడా వెంట ఉంచుకోండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని సేద తీరుస్తుంది. ఎండన పడి వచ్చినవాళ్లకు చల్లని మజ్జిగ లేదా పుచ్చకాయ ముక్కలు ఇచ్చినా.. ఎండ వేడి నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు.