ప్రతి నెల రుతుక్రమం మొదలు కాబోతున్నదంటే చాలు.. మహిళల్లో చికాకు మొదలవుతుంది. కొందరు డిప్రెస్ అవుతుంటారు. నెలసరికి ముందు శారీరకం గానే కాకుండా ఇలాంటి శారీరక మార్పులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివి తగ్గాలంటే రెగ్యులర్‌గా అరటి పండు తినమంటున్నారు నిపుణులు.
నెలసరికి ముందు చికాకు పెట్టే సమస్యలనే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) అంటారు. దీనితో బాధపడుతున్నవాళ్లకు అరటి పండు మంచి మందుగా పనిచేస్తుంది. నెలసరి ప్రారంభానికి కనీసం వారం ముందు నుంచి రోజూ ఒక అరటి పండు తింటుంటే పీఎంఎస్ లక్షణాలు తక్కువగా ఉంటాయి. పీరియడ్స్‌కి ముందు కనిపించే ఆందోళన, ఉద్వేగం, చిరాకు, డిప్రెషన్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. అరటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అధికంగా రక్తస్రావం అయ్యే సమస్య ఉన్నవాళ్లకు కూడా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.
పిఎంఎస్‌లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అశాంతితో నిరుత్సాహంగా ఉన్నప్పుడు అరటి పండు తింటే ఉత్సాహంగా, చురుగ్గా అనిపిస్తుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా అరటి పండు తిన్న తరువాత చాలా మార్పు కనిపిస్తుంది. అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది. అందుకే క్రమం తప్పకుండా అరటి పండును ఉదయం గాని, మధ్యాహ్నం భోజనం తర్వాత గానీ తింటే మెదడు చురుకుదనం పెరిగినట్టు పలు అధ్యయనాల్లో స్పష్టమైంది. అంటే మెదడులో భావోద్వేగాలు సమతుల్యంలో ఉంచడంలో కూడా అరటి పండు బాగా పనిచేస్తుంది. అందుకే రోజూ అరటి పండును ఆహారంలో చేర్చండి.